తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
- స్వయంగా కాల్వలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు
- అధికారులకు కీలక ఆదేశాలు
నరసరావుపేట, ఆంధ్రప్రభ: మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రోడ్లపై కూలిన చెట్లు, నీటితో నిండిన డ్రైనేజీ కాలువలను తనిఖీ చేసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలకు రోడ్లపై విరిగిపడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పురపాలక, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా కాలువల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీల్లో అడ్డంకులను తొలగించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు స్వయంగా కాలువల్లో ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాను, భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
