డీప్‌సైడ్ బ్లాక్ కోసం కృషి చేసిన భట్టికి ఎమ్మెల్యే పాయం కృతజ్ఞతలు
మణుగూరు సింగరేణి ఓసీ-2 డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణి పరిధిలోకి..
కార్మికులు, కుటుంబాలకు ప్రయోజనం
ప్రాంత అభివృద్ధే లక్ష్యం
ఆంధ్రప్రభ, హైదరాబాద్: మణుగూరు సింగరేణి ఓసీ-2 డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణి సంస్థకు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుని, ఎంతో కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణి పరిధిలోకి తీసుకురావడంలో భట్టి విక్రమార్క చూపిన ప్రత్యేక శ్రద్ధ, కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని అందజేశారు.
మణుగూరు ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన సింగరేణి ఓసీ-2 డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణి సంస్థ పరిధిలోకి రావడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. దీని ద్వారా కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మణుగూరు, పినపాక నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్ణయం మరింత ఊతమిస్తుందని అన్నారు.
సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మణుగూరు ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభించేలా కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. పినపాక నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకారంతో మణుగూరు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
