నివాళులర్పించిన ఎమ్మెల్యే, డీఈవో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఆశన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం హఠాత్తుగా మృతి చెందారు. ఆశన్న పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఉట్నూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆశన్న పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంఈఓ ఆశన్న అకాల మరణం ఎంతో బాధాకరమని అన్నారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సాయంత్రం ఆశన్న అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, డీఈవో మాధవితో పాటు ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ బేగం అన్సారి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముడుగు శ్యాముల్, పీఆర్‌టీయూ మాజీ సీనియర్ అధ్యక్షుడు జీవన్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల్ చవాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాథోడ్ సుమన్‌బాయి, బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు భరత్ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సాడిగే గంగన్న, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ సలీముద్దీన్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు షేక్ షబ్బీర్, మల్లారెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు గోవిందు, భూమన్నతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
