MLA | బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం
- సంగెంకలాన్లో ఆరాచకాలు, దౌర్జన్యాలు సాగవు
- మల్కాపూర్, సంగెంకలాన్, ఐనెల్లి, జినుగుర్తిలో ఎన్నికల ప్రచారం
MLA | తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(MLA Pilot Rohit Reddy) ప్రచారం నిర్వహించారు. ఈ రోజు తాండూరు మండలంలోని సంగెంకలాన్, మల్కాపూర్, జినుగుర్తి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఐనెల్లి తదితర గ్రామాల్లో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సంగెంకలాన్(Sangenkallan) గ్రామంలో దౌర్జన్యాలు, అరాచకాలను ఈ ఎన్నికలతో ప్రజలు అంతమొందిస్తారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే తీర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని, దీంతో అభివృద్ధి నోచుకోలేదని అన్నారు.
సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కు కావడంతో వర్షాకాలంలో గ్రామం వరదనీటిలో మునిగి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పలు గ్రామాల నేతలు, సర్పంచు అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు ఉన్నారు.. మరోవైపు రోహిత్ రెడ్డి సర్పంచు అభ్యర్థులకు వచ్చిన గుర్తులను చేత పట్టుకుని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడంతో అక్కడి ప్రజలు రోహిత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.

