అమ్మేస్తే సహించం : కేటీఆర్
- 550 ఎకరాల భూములపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
- పేదలు, అమరవీరులు, ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్
- రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు.. ఏడాదిలోపే కేసీఆర్ తిరిగొస్తారని వ్యాఖ్య
- హైదర్‌నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిక
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని విక్రయించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
‘భూములు అమ్మే బ్రోకర్‌ను సీఎం చేస్తే ఇలాగే ఉంటుంది’
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అడవులను నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్మే బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే అలా ఉంటుందని విమర్శించారు. మియాపూర్ భూముల వ్యవహారంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కబ్జా ప్రయత్నాలు జరిగినప్పుడు, వాటిని కాపాడేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రముఖ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించి న్యాయపోరాటం చేసిందని తెలిపారు. 550 ఎకరాల భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించిందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు రాగానే విక్రయ ప్రకటన!
మియాపూర్ భూములపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి భూములను విక్రయించే ప్రతిపాదనను ప్రకటించారని విమర్శించారు. ప్రభుత్వానికి దక్కిన విలువైన భూములను అమ్మడం కంటే ప్రజల అవసరాలకు వినియోగించాలన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్క నిర్మాణమైనా చేపట్టారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించామని గుర్తుచేశారు.
పేదలు, అమరవీరులు, ఉద్యమకారులకే కేటాయించాలి
మియాపూర్‌లో ప్రభుత్వానికి దక్కిన 550 ఎకరాల భూములను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కేటీఆర్ సూచించారు. అందులో 200 ఎకరాలను పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు. మరో 100 ఎకరాలను అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలను తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని ప్రతిపాదించారు. మిగిలిన భూముల్లో పిల్లల కోసం పాఠశాలలు, కళాశాలలు నిర్మించాలని సూచించారు. ఈ విధంగా భూములను ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు.
‘భూదందాలకు చెక్ పెడతాం’
హెచ్‌ఐఎల్‌టీపీ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రలోభాలకు ఆశపడి ఎవరైనా ఆ భూములను కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో వాటిని అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న భూదందాలన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఏడాదిలోపే కేసీఆర్ తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మియాపూర్ భూముల విక్రయంపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా మంత్రివర్గ పరిశీలనకు వెళ్లాల్సి ఉందని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూములను విక్రయించకుండా ప్రజా అవసరాలకు కేటాయించాలన్న కేటీఆర్ డిమాండ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
