తప్పిపోయిన మహిళ క్షేమంగా ఇంటికి!
రాజాపేట పోలీసుల చొరవతో..
రాజాపేట, ఆంధ్రప్రభ: కుటుంబానికి దూరమైన ఓ మహిళను పోలీసులు సురక్షితంగా బంధువుల చెంతకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండల సర్పంచ్ అరిగే ధర్మతేజ సోదరి జ్యోతి ఆదివారం ఇంటి నుంచి తప్పిపోయింది. హైదరాబాద్ మీదుగా రాజాపేటకు చేరుకున్న ఆమెను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
మతిస్థిమితం లేని జ్యోతిని గమనించిన రాజాపేట ఎస్సై తఖియొద్దీన్, ఏఎస్సై నాయుడు వెంటనే స్పందించారు. ఆమె వివరాలను సేకరించి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆమెను పోలీసుల సంరక్షణలో ఉంచారు.
పోలీసుల నుంచి సమాచారం అందుకున్న సర్పంచ్ ధర్మతేజ, జ్యోతి భర్త విట్టల్ బుధవారం తెల్లవారుజామున రాజాపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు జ్యోతిని వారికి క్షేమంగా అప్పగించారు. సుమారు 200 కిలోమీటర్ల దూరంలో తప్పిపోయిన తమ సోదరిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించడంపై ధర్మతేజ రాజాపేట పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పిపోయిన వ్యక్తి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంలో పోలీసులు చూపిన చొరవ పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజునాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
