ఔను.. పచ్చని అడవి తల్లి ఒడిలో.. కొండల్లో కోనల్లో సెలయేటి నురగల్లో చిరుగాలి సందట్లో.. కాకతీయ సామ్రాజ్య రాజధానిలోని రామప్ప ఆలయంలో.. అందచందాలను జగదేక సుందరీ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు ఆస్వాదించనున్నారు. ఈ వన్నెచిన్నల ముద్దుగుమ్మలకు తనివి తీరాల్సిందే. తన్మయంతో పరవశించాల్సిందే. ఇక ఆశ్చర్యం తప్పదు. ఆనందంతో ఆ కళ్లు మెరవాల్సిందే. కోయిల గానామృత వీనుల విందులో.. ఈ మృదుమధుర మగువల అందెల రవళి మోగాల్సిందే. ‘‘తరులెక్కి ఎల నీలి గిరినెక్కి మెల మెల్ల.. చదలెక్కి జల దంపు నీలంపు నిగ్గునై..ఆకలా దాహమా చింతలా వంతలా..ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ.. ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా’’.. అంటూ రామప్ప ఆలయంలో మైమరచి పోవాల్సిందే. కానీ .. ఇక్కడి రామభంటుల కిష్కిందకాండ.. నాగుల నాట్యాన్ని వీక్షిస్తే.. కథ కంచికే. అందుకే అందాల రాసుల రాకతో కమనీయ రామప్ప ఆలయాన్ని .. కోతులు..పాముల రహిత ప్రదేశంగా మార్చటానికి ములుగు జిల్లా అటవీశాఖ అహోరాత్రులు శ్రమిస్తోంది. కోతులను బంధించి.. పాముల్ని పట్టుకుని అడవికి సాగనంపే నిపుణుల వేటలో ఈ అటవీశాఖ నిమగ్నమైంది. ఎనీ హౌ మరో మూడు రోజుల్లో రామప్ప ఆలయంలో అందాల భామకలాపం జరగనుంది.
( ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్) చుట్టూ అడవులు, గుట్టల మధ్య ములుగు జిల్లాలోని చారిత్రాత్మక రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. అత్యంత పురాతన పర్యాటక ఆలయంగా యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఈ రామప్ప ఆలయాన్ని సందర్శించి, పరవశించేందుకు 109 దేశాల పరువాల ముద్దు గుమ్మలు ఈ నెల 14 న రానున్నారు. మరో వైపు హన్మకొండలోని వెయ్యి స్తంభాల రుద్రేశ్వర ఆలయం, చారిత్రాత్మక వరంగల్ కోటనూ ఈ ప్రపంచ అందాల భామలు సందర్శించనున్నారు. ఈ పురాతన రామప్ప ఆలయం, రామప్ప సరస్సు ఈ నెల 14 ప్రపంచ సుందరీమణుల రాకతో తళుక్కుమననుంది. 13వ శతాబ్దంలో గణపతి దేవ కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు కాకతీయుల సంక్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థకు తార్కాణంగా నిలుస్తుంది.
కోతుల బెడదే తిరకాసు
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రపంచ అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పాములు, కోతులను పట్టుకునే క్యాచర్స్ ను రంగంలోకి దించారు, ములుగు జిల్లాలోని అతి పురాతన రామప్ప ఆలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువే. చుట్టూ అడవులు, గుట్టలతో కూడిన ప్రాంతం కావడంతో వానర సంచారం మామూలే.ఇక ఆహార్వాన్వేషణలో .. ఈ కోతులకు ఆకలి తిప్పలు తప్పని స్థితి. రామప్ప ఆలయానికి వచ్చే భక్తుల చేతుల్లో సంచులు, పండ్లను, ఆహారాన్ని కోతులు లాక్కొంటాయి. చిరాకు పడే భక్తులపై దాడికి వెనకాడవు. ఇలాంటి ఘటనల్లో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో,, ఆలయ సందర్శనానికి వచ్చే ప్రపంచ సుందరీమణులపై ఈ కోతులు ఎగబడితే.. వామ్మో డామిట్ కథ అడ్డం తిరుగుతుంది. అందాల పోటీలను నిర్వహించే రాష్ర్ట ప్రభుత్వం ఇజ్టత్ పోతుంది. అందుకే రామప్ప ఆలయమే కాదు..వెయ్యి స్థంభాలగుడి, వరంగల్ కోటలో తిష్టవేసిన కోతులను జల్లెడపట్టి అడవికి పంపించే యజ్ఞంలో అటవీశాఖ నిమగ్నమైందని సమాచారం. ఇప్పటికే రామప్ప ఆలయం లోని కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది.
ఏపీ నుంచి మంకీ క్యాచర్స్ దిగుమతి
ప్రపంచ అందాల భామలు రామప్ప ఆలయ సందర్శనకు రానున్న నేపథ్యంలో ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రామప్ప ప్రాంతంలో కోతుల బెడద వల్ల సుందరీమణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మంకీ క్యాచర్స్ ను రప్పించారు. ప్రత్యేకంగా బోనులను కూడా తెప్పించారు. రామప్ప ఆలయ పరిధిలో ఒక్క కోతి కూడా కనిపించకూడదని అటవీశాఖ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికి 150 కోతులను వెంకటాపురం అడవికి తరలించారు.
పాముల వేటలో స్నేక్ క్యాచర్స్ బిజీబిజీ
రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచారం అత్యధికమే. అందాల భామలు వచ్చిన వేళ.. పాముల కదలికలను ముందే పసిగట్టి.. పాములను పట్టుకుని అడవికి తరలించే ఏర్పాట్లనూ అటవీశాఖ చేపట్టింది. పాములను పట్టుకునేందుకు స్నేక్ క్చాచర్స్ ను రంగంలోకి దించారు. ఈ స్థితిలో ప్రపంచ అందెగత్తెల సంబురానికి కోతులు, పాముల నుంచి ఎలాంటి విఘాతం కలగకుండా అన్నీ చర్యలు చేపట్టారు.
ఆ రోజు దర్శనం రద్దు
ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.ఈ నెల 14న రామప్ప , వెయ్యి స్తంభాల ఆలయాలను సాధారణ ప్రజల దర్శనాలను నిలిపివేస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా ఆలయాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధాన్ని విధించారు..