MISHTI | అటవీ శాఖకు పవన్ కల్యాణ్ అభినందనలు
అమరావతి, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిష్టి (MISHTI) పథకం కింద దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పర్యావరణ పునరుద్ధరణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా రాష్ట్రం సాధించిన గర్వకారణమైన విజయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, అటవీ దళాధిపతి (PCCF & HoFF), సీనియర్ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది సహా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలోని ప్రతి సభ్యుడికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో 2,047 హెక్టార్లకు పైగా మడ అడవులను విజయవంతంగా పునరుద్ధరించడం, వినూత్న పరిరక్షణ చర్యలను అమలు చేయడం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడం అటవీ శాఖ సమిష్టి కృషికి నిదర్శనమని కొనియాడారు.
జీవవైవిధ్య పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు సుస్థిర జీవనోపాధిని అందించే లక్ష్యంతో మరింత పచ్చని, పర్యావరణహితమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మిష్టి (MISHTI) పథకం అమలులో మొదటి స్థానం గుజరాత్‌కు దక్కింది. గుజరాత్లో సుమారు 19,500 హెక్టార్లకు పైగా మడ అడవుల పునరుద్ధరణ, అభివృద్ధి చేపట్టడంతో ఆ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
మిష్టి (MISHTI) ప్రధాన ఉద్దేశ్యం
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ తీర ప్రాంతాలను మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023లో మిష్టి (MISHTI) పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని తీర ప్రాంతాల్లో మడ అడవులను విస్తరించడం, ఇప్పటికే ఉన్న మడ అడవులను పునరుద్ధరించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమాన్ని దేశంలోని 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. సముద్ర తుఫాన్లు, అలల ఉద్ధృతి, తీర కోత వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాలను రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కార్బన్‌ను అధికంగా గ్రహించి నిల్వ చేసే సామర్థ్యం కలిగిన మడ అడవులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలోనూ ముఖ్యమైనవిగా గుర్తిస్తోంది.
మిష్టి పథకం అమలుకు కంపా (CAMPA), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)తో పాటు ఇతర ప్రభుత్వ పథకాల నుంచి నిధులను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా మడ అడవుల సంరక్షణకు దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తున్నారు.
మడ అడవుల విస్తరణ వల్ల పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా చేపల వనరుల పెరుగుదల, తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన, జీవవైవిధ్య సంరక్షణ వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా మడ అడవుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
మిష్టి పథకం ద్వారా పునరటవీకరణ, అటవీకరణ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ భారత తీర ప్రాంతాలను మరింత పచ్చగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కూడా భారత్ ముందుకు సాగుతోంది.
