మైనర్లు బైక్ నడిపితే జైలే

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: ఆపద సమయంలో ధైర్యంగా ఉండండి పోలీసులు మీకు అండగా ఉంటారంటూ నందికోట్కూరు శక్తి టీం విద్యార్థినులకు భరోసా ఇచ్చింది. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేక చొరవతో ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.ఇందులో భాగంగా నందికోట్కూరు సర్కిల్ శక్తి టీం సిబ్బంది ఏఎస్ఐ ఖాదర్ బాషా పిసి రసూల్ నందికోట్కూరులోని నవ నంది హైస్కూల్ ను సందర్శించారు.

పాఠశాల కరస్పాండెంట్ బి. శ్రీధర్ ఉపాధ్యాయుల సమక్షంలో 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.విద్యార్థినులు తమ మొబైల్ లో శక్తి యాప్ 7993485111 ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ఏదైనా ఇబ్బంది ఎదురైతే అందులోని 112 బటన్ నొక్కితే చాలు 5 నిమిషాల్లో పోలీసులు స్పందిస్తారని తెలిపారు. ఈవ్ టీజింగ్ వెంటపడి వేధించడం అసభ్య ప్రవర్తన వంటివి ఎదురైతే భయపడకుండా టీచర్లకు తల్లిదండ్రులకు లేదా శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.అంతేకాకుండా బాల్య వివాహాల నిరోధానికి 1098 మహిళా సంక్షేమానికి 181 సైబర్ మోసాలకు 1930 టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేకంగా హెచ్చరించారు.

మైనర్లు బైక్ నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా బైక్ సీజ్ చేస్తామని, వాహనం ఎవరి పేరు మీద ఉంటే వారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిల్లలు చెప్పాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఫోన్లలో శక్తి యాప్ ను ఇన్ స్టాల్ చేయించారు.