పైడితల్లమ్మను దర్శించుకున్న మంత్రులు
విజయనగరం, ఆంధ్రప్రభ : విజయనగరం గ్రామదేవత, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడి తల్లమ్మను జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే హోంమంత్రి వర్గాలపూడి అనిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కొండపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ సిరిమానోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో కూడా సిరిమానోత్సవం ఘనంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తుఫాన్ కారణంగా సిరిమానును ముందుగానే ప్రారంభించి భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల దర్శన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ పైడితల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
