కలెక్టరేట్‌లో అర్ధరాత్రి వరకూ..

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : తీవ్ర తుఫాన్ ‘మొంథా’ కాకినాడ–మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటిన నేపథ్యంలో, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం అర్ధరాత్రి వరకు భీమవరం కలెక్టరేట్‌లోనే ఉండి అధికారులతో సమీక్ష కొనసాగించారు.

వీరితో పాటు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర ఉన్నతాధికారులు తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై నిరంతరంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

తుఫాన్ పూర్తిగా తీరం దాటే వరకు మంత్రులు కలెక్టరేట్‌లోనే ఉండి తక్షణ సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస శిబిరాలకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు.

తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తంగా ఉంచి, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ప్రజలు భయాందోళన చెందకూడదని, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొని, ప్రజలకు పూర్తి అండగా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply