ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
మహిళల పేరుతోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క
మంగపేట, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
బుధవారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట రైతు వేదికలో తహసీల్దార్ తోట రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో కేటాయించడం, రేషన్ కార్డులను మహిళల పేరుతో అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడంతో పాటు కుటుంబ సంక్షేమంలో వారి పాత్రను గుర్తించి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో తహసీల్దార్ తోట రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆత్మ డైరెక్టర్ గాదె శ్రావణ్, భద్రాచలం రామాలయం బోర్డు సభ్యుడు పూజారి సురేందర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు, మాజీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు అయ్యోరి యానయ్య, వల్లెపల్లి శివప్రసాద్, టి.వి. హిదయతుల్లా, పాయం అనిత, బాడిశ ఆదినారాయణ, మురుకుట్ల నరేందర్, బి. నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
