మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
43 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల అందజేత
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి
మంగపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క బుధవారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంపోనిగూడెం రైతు వేదికలో 43 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు.
అనంతరం మండలంలోని మల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని మామిడిగూడెంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాడగూడెం గ్రామానికి చెందిన మంగపేట రైతుసేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ తండ్రి తోట వీరయ్య ఇటీవల మృతి చెందారు. దీంతో మంత్రి సీతక్క మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, పితృ శోకంతో ఉన్న తోట రమేష్‌కు మనోధైర్యం కల్పించారు.
అనంతరం రాజుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల జిల్లా ఇన్‌చార్జి కర్రి నాగేంద్రబాబు పండు తల్లి కర్రి సుజాత ఇటీవల మృతి చెందడంతో మంత్రి సీతక్క ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాతృ శోకంతో ఉన్న కర్రి నాగేంద్రబాబుకు మనోధైర్యం తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
