పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
ఉన్నత లక్ష్యాలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి.. మంత్రి సీతక్క
మంగపేట, ఆంధ్రప్రభ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఉన్నత లక్ష్యాలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 14 ల్యాప్‌టాప్‌లతో కూడిన కంప్యూటర్ ప్రయోగశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు.
ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు 14 ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కన్నాయిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి వరకు చదివి, అనంతరం జవహర్‌నగర్‌లో ఇంటర్ విద్యను అభ్యసించిన ఓ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పట్టుదలతో చదవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యాలయంలో భోజన నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల గురించి మంత్రి విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సంకోచించకుండా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి, జీసీడీఓ బుర్ర రజిత, మండల విద్యాశాఖ అధికారి మేనక, పాఠశాల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణబాబు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
