కలెక్టర్, ఎస్పీలకు మంత్రి సవిత కితాబు
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ల కాంబినేషన్ గుడ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ జిల్లాలో మంచి అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై మంచి విజయం సాధించాలని, ( కాంబినేషన్ హిట్ కొట్టాలని) రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గురువారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో చిత్రావతి నది రోడ్డున ప్రముఖ వ్యాపార సంస్థ జోయాలుకాస్ ఆర్థిక సహాయంతో పూర్తి చేసిన సత్యసాయి అందమైన పార్క్ ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి సవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్లనుద్దేశించి మంత్రిపై విధంగా కామెంట్ చేశారు.

ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లా వీరి ఇద్దరి కాంబినేషన్లు అన్నివిధాలా అభివృద్ధి సాధించి ముందుకు వెళ్లి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా కలెక్టర్, ఎస్పీ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ప్రజా సమస్యలు, అభివృద్ధి, శాంతిభద్రతలు అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా పుట్టపర్తి పట్టణంలో జరుగుతున్న సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావించి, ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయుటకు కలెక్టర్ ఎస్పీలు ఒకే బుల్లెట్ ద్విచక్ర వాహనంలో తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి సవిత కలెక్టర్ ఎస్పీల కాంబినేషన్ మంచి కాంబినేషన్ అని కితాబు ఇచ్చిందని భావించవచ్చు.

