ఏలూరు ఎంపీతో మంత్రి పార్థసారథి, మాగంటి బాబు భేటీ
- జిల్లా రాజకీయాలు, స్థానిక ఎన్నికలపై నేతల మధ్య ఆత్మీయ చర్చలు
- ఎంపీ కొత్త నివాసం, కార్యాలయాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు
ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్‌తో జిల్లా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. వట్లూరు పరిధిలోని సీతాపురం కాలనీలో ఎంపీ మహేష్ యాదవ్ నూతనంగా నిర్మించిన నివాసం, శిబిర కార్యాలయాల్లో ఆది, సోమవారాల్లో నిర్వహించిన ఆత్మీయ విందులకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంగళవారం మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మాజీ ఎంపీ మాగంటి బాబు ఎంపీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి.
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ కమిలి విఠల్‌రావు ఎంపీ నివాసానికి వచ్చారు. అనంతరం 11 గంటల సమయంలో మాజీ ఎంపీ మాగంటి బాబు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మహేష్ యాదవ్‌తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు కొద్దిసేపు జిల్లా రాజకీయాలపై మనసు విప్పి మాట్లాడుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం మాగంటి బాబు, విఠల్‌రావులకు ఎంపీ తన నూతన గృహం, కార్యాలయ భవనాన్ని మొత్తం తిప్పి చూపించారు. వారిని శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
మధ్యాహ్నం సమయంలో ఏలూరు ఎంపీ నివాసానికి మంత్రి పార్థసారథి చేరుకోగా.. ఎంపీ మహేష్ యాదవ్ సాదరంగా స్వాగతం పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా రాజకీయాలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు. అనంతరం కలిసి భోజనం చేశారు. ప్రతి నెలా ఒక ప్రజాప్రతినిధి నివాసంలో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం ద్వారా నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే తొలగిపోయి సమన్వయం మరింత పెరుగుతుందని ఇరువురు అభిప్రాయపడ్డారు. దాదాపు గంటసేపు ఎంపీ నివాసంలో గడిపిన మంత్రి పార్థసారథి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అనకాపల్లికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మంత్రి పార్థసారథిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించి వాహనం వరకు వెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు.
అనంతరం వివిధ సమస్యలపై తనను కలిసేందుకు వచ్చిన ప్రజల నుంచి ఎంపీ మహేష్ యాదవ్ వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ మహేష్ యాదవ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు తేనీరు సేవిస్తూ కొద్దిసేపు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
పోలవరం ప్రాజెక్టుతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కూటమి నేతల మధ్య సమన్వయం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీ, ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ నేతల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. అంతకుముందు సోమవారం సాయంత్రం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఎంపీ మహేష్ యాదవ్‌తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఏలూరు ఎంపీ నివాసంలో వరుసగా జిల్లా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి.


