ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష
పాలకొల్లు, ఆంధ్రప్రభ: భారీ వర్షాల నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి అందే ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ.. అందుకు అనుగుణంగా వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే వరద నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి సూచించారు. మున్నేరు ఇన్‌ఫ్లో, బుడమేరు వరద పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ.. వాటి ఆధారంగా పట్టిసీమ పంపులను నిర్వహించాలని ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి పురుషోత్తపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదుల ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు వార్ రూమ్‌లో నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కాడా కమిషనర్ ప్రశాంతి, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ, సీఈలు, ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
