మహిళా సంక్షేమానికి పెద్దపీట…

రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌
278 మంది మైనారిటీ మహిళలకు రూ.1.39 కోట్ల గ్రాంట్‌ చెక్కుల పంపిణీ


ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు గ్రాంట్‌ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైనారిటీ మహిళలు చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేలా ఆర్థికంగా ప్రోత్సహించడమే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ప్రధాన ఉద్దేశమన్నారు. పథకం కింద ఒక్కో మహిళకు రూ.50 వేల చొప్పున పూర్తిగా ఉచిత గ్రాంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 278 మంది మహిళలకు రూ.1.39 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.ఇంకా రాతి కోత పనుల ద్వారా జీవనోపాధి పొందుతున్న తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మంది లబ్ధిదారులకు టూల్‌కిట్లు, జనరేటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. పేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాలకు చెందిన నిరాశ్రయులు, వితంతువులు, అనాథలు, విడాకులు పొందిన మహిళలు, అవివాహితులు, ఒంటరి మహిళలకు ఈ పథకం ద్వారా ఒక్కసారి రూ.50 వేల చొప్పున తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు ఉపయోగపడే చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని సూచించారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న వ్యాపారాలు ప్రారంభించి తమ కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. ‘చేపలు ఇస్తే ఒకరోజు మాత్రమే సరిపోతుంది.. చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం ఉపయోగపడుతుంది’ అన్న నానుడిని ప్రస్తావిస్తూ.. ఆర్థిక సాయాన్ని వృథా చేయకుండా స్వయం ఉపాధికి వినియోగించుకోవాలని కోరారు.ఇంకా కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకరయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.