టీపీసీసీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ
- నా ప్రమేయం లేదు..
- నన్ను బాధ్యురాలిగా చేయడం సముచితం కాదు..
ఆంధ్రప్రభ : టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వివరణతో కూడిన లేఖను క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి గురువారం పంపించారు. తనపై వచ్చిన అభ్యంతరాలకు లేఖ ద్వారా స్పష్టత ఇచ్చిన మంత్రి.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సముచితం కాదని పేర్కొన్నారు.
సుస్మితా వ్యాఖ్యలపై వివరణ కోరిన క్రమశిక్షణా కమిటీ…
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే అంశంపై వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీనియర్ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు ఇచ్చింది.
ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ స్పందించింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా వివరణ సమర్పించాలని కమిటీ ఆదేశించినట్లు నోటీసులో పేర్కొంది.
కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతం…
తన స్వస్థలమైన గీసుకొండతో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి సురేఖ తన వివరణలో తెలిపారు. ఈ కారణంగానే అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం ఉన్నంత మాత్రాన ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సి రావడం సముచితం కాదని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని క్రమశిక్షణా కమిటీకి వివరించారు.
నోటీసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని కోరారు.
తన కుమార్తె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సరికాదని పేర్కొన్న మంత్రి.. ఈ అంశంలో తన ప్రమేయం లేదని గుర్తించి తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

