Minister | విద్యాభివృద్ధికి ముంద‌డుగు

Minister | విద్యాభివృద్ధికి ముంద‌డుగు

  • మంత్రి టీజీ భరత్

Minister | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఓర్వకల్లు విమానాశ్రయం సమీపంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉర్దూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణానికి తన వంతుగా రూ.కోటి విరాళం అందజేశానని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో కొనసాగి ఉంటే ఈ విశ్వవిద్యాలయ భవనం ఎప్పుడో పూర్తయ్యేదని, గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే అనేక కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు.

ఉర్దూ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా బీసీ భవన్, కాపు భవన్ వంటి సామాజిక ప్రాధాన్యత గల భవనాల నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం అడ్డుకుందని మంత్రి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ అంశాలపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని, మంచి పనులు చేసే నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సరైన విద్య అందించడం ద్వారా విద్యార్థుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని మంత్రి స్పష్టం చేశారు.

దావోస్ పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి విద్యా వ్యవస్థపై విస్తృతంగా చర్చించామని, విద్యారంగంలో సంస్కరణలకు లోకేష్ గారు అనేక కీలక మార్పులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమంగా ప్రపంచానికి పరిచయం చేశామని, పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై విశ్వాసం పెరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగులు వేస్తున్నారని, ఎప్పుడూ లేనివిధంగా కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.

ఇప్పటికే రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో సంబంధిత పనులు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో మరో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు జిల్లాకు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. విద్య, మౌలిక వసతులు, పెట్టుబడులే రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలన్న దృఢనమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఉర్దూ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.

Leave a Reply