ఓటు హక్కు కోసం సొంతూరికి వలస కూలీలు!
ఓటేసేందుకు స్వగ్రామానికి చేరుకున్న కూలీలు
తిమ్మాపురంలో పోలింగ్ కేంద్రం వద్ద బారులు
సుమారు 200 కుటుంబాల రాకతో సందడి
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : పొట్టకూటి కోసం పల్లెను విడిచి వలస వెళ్లిన కూలీలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూరి బాట పట్టారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎమ్మిగనూరు పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి సుమారు 200 వలస కూలీల కుటుంబాలు ఓటు వేసేందుకు రావడం విశేషంగా నిలిచింది.
కూలీ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామానికి తిరిగివచ్చారు. గురువారం నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద వలస కూలీలు బారులు తీరారు.
ఉపాధి కోసం ఊరికి దూరంగా ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు స్వగ్రామానికి రావడం ద్వారా ప్రజాస్వామ్యంపై తమకున్న బాధ్యతను చాటిచెప్పారు. వలస కూలీల రాకతో తిమ్మాపురం గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
