Meta Layoffs |టెక్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలో మెటా!

ఆంధ్రప్రభ వెబ్‌న్యూస్‌: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కలవరం సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ తన ఉద్యోగులకు ఓ సరికొత్త, ఆశ్చర్యకరమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లే వారికి భారీ ప్యాకేజీని ఇచ్చేందుకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్, ఇప్పటికే గూగుల్, మైక్రోసాప్ట్‌ కంపెనీలు ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించగా వాటి బాటలోనే మెటా నడుస్తుంది. తాజాగా ఫ్రాన్స్‌లోని తన ఉద్యోగులకు ఈ వీడ్కోలు ఆఫర్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న 300 మందిలో దాదాపు 100 మంది వరకు ఈ ప్యాకేజీని ఉపయోగించుకుని సంస్థను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులైన ఉద్యోగులు నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

మెటా ఆఫర్ చేస్తున్న ఈ ప్యాకేజీ టెక్ నిపుణులను ఆకర్షిస్తోంది. సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదికి 2.15 నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు. అంతేకాకుండా, మరో 10 నెలల పాటు వారి స్థూల జీతంలో 80 శాతం మొత్తాన్ని చెల్లించేలా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఉద్యోగం వదిలిన వారు కొత్త కొలువు వెతుక్కోవడానికి, రీ-స్కిల్లింగ్ పొందడానికి మెటా పూర్తిగా సహకరించనుంది. సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికీ అండగా నిలవాలని చూస్తోంది.

మెటా ఫ్రాన్స్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2023లోనూ అక్కడ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అప్పట్లో సుమారు 350 మంది ఉద్యోగులున్న సంస్థలో 88 మంది బయటకు వెళ్లే అవకాశం ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గతంలో పెద్ద టీమ్‌లు చేసిన పనులను ఇప్పుడు ఒక్క ఏఐ టూలే చిటికెలో చేసేస్తోంది. ఇదే విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సైతం గతంలో స్పష్టం చేశారు. ఏఐ రాకతో కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు, అవసరాలు పూర్తిగా మారిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీలను ప్రకటించాయి.

ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే.. మరోవైపు ఏఐ రంగంపై మెటా భారీగా ఖర్చు చేస్తోంది. కేవలం 2026 సంవత్సరంలోనే డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక వసతుల కోసం ఏకంగా 135 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని టార్గెట్ పెట్టుకుంది. మొత్తానికి ఏఐ హవా నడుస్తున్న ఈ తరుణంలో మెటా తీసుకున్న ఈ నిర్ణయం టెక్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.