Child Safety | కొత్త ఏఐ సాధనాలతో ఉల్లంఘనల గుర్తింపు..

భారత్‌లో 53 లక్షల కంటెంట్‌పై చర్యలు

Child Safety | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో బాలల లైంగిక దోపిడీని అరికట్టేందుకు అదనపు చర్యలు చేపట్టినట్లు మెటా వెల్లడించింది. నేరస్థులు తమ పద్ధతులను మార్చుకుంటున్న నేపథ్యంలో కొత్త ఏఐ సాధనాలతో పాటు పలు వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు తెలిపింది. పైకి సాధారణంగా కనిపించే ప్రకటనల ద్వారా ప్లాట్‌ఫారమ్‌ వెలుపల ఉన్న అక్రమ కంటెంట్‌ వైపు వినియోగదారులను మళ్లించే ప్రయత్నాలను గుర్తించేందుకు కొత్త లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ప్రకటనలు వినియోగదారులను ఎక్కడికి తీసుకెళ్తున్నాయో విశ్లేషించి.. ఉల్లంఘనలకు పాల్పడే వెబ్‌సైట్లు, లింకులు, ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. పునరావృత ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించడం, రక్షణ వ్యవస్థల్లో లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఏఐ ఆధారిత రెడ్‌ టీమింగ్‌ వ్యవస్థను ఉపయోగించడం వంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

మెటా ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ యాప్‌లలో యువతను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అనుమానాస్పద ఖాతాల నెట్‌వర్క్‌లను గుర్తించి, అవసరమైనప్పుడు తొలగించడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదిస్తున్నామని చెప్పారు. ఫొటోడీఎన్‌ఏ సహా ఫొటో, వీడియో మ్యాచింగ్‌ సాంకేతికతలతో ఇప్పటికే గుర్తించిన బాలల లైంగిక దోపిడీ కంటెంట్‌ కాపీలను గుర్తించి తొలగిస్తున్నామని తెలిపారు. జనవరి నుంచి జూన్‌ 2026 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో 3.32 కోట్ల కంటెంట్‌పై చర్యలు తీసుకోగా, 97 శాతానికి పైగా కంటెంట్‌ను ఫిర్యాదు రాకముందే తమ వ్యవస్థలు గుర్తించాయని చెప్పారు. ఇదే కాలంలో భారత్‌లో 53 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకోగా, 98 శాతానికి పైగా కంటెంట్‌ను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తూ, బాలల భద్రతకు సంబంధించిన కేసులను ఐ4సీ నిర్వహిస్తున్న జాతీయ సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌ పోర్టల్‌కు నేరుగా నివేదించే విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.