ఆర్టీసీ విలీన‌మే ల‌క్ష్యం.. టీజేఎంయూ గెలుపే ధ్యేయం

కార్మికుల‌ సమావేశంలో నిర్మలాజగ్గారెడ్డి పిలుపు
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే అది కాంగ్రెస్‌తో సాధ్యమవుతుందని డీసీసీ అధ్య‌క్షురాలు నిర్మ‌లాజ‌గ్గారెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌ (టీజేఎంయూ) అభ్యర్థుల విజయానికి కార్మికులు, నాయకులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె కోరారు.

గురువారం మధ్యాహ్నం సంగారెడ్డిలో ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో నిర్వహించిన ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా రీజియ‌న్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. అక్టోబర్ 9న జరగనున్న యూనియన్ ఎన్నికల్లో గ‌ద గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో విజ‌యం సాధించాల‌ని కార్మికుల‌ను కోరారు. కొత్త బస్టాండ్ ఎదురుగా బుధవారం టీజేఎంయూ కార్యాలయాన్ని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వ‌ర్యంలో ప్రారంభించారు. అనంతరం కొత్త బస్టాండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మ‌లాజ‌గ్గారెడ్డి మాట్లాడుతూ గతం ప్రభుత్వంలో యూనియన్లు లేకుండా చేశారని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని ఆమె ఆర్టీసీ కార్మికుల‌కు సూచించారు. మా వంతు సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని, గెలు పే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. టీజేఎంయూ గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ గెలుపు కోసం టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ భయపడకుండా మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర కార్య‌ద‌ర్శి హనుమంతు ముదిరాజ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బీవీకే రావు, మున్సిపల్ చైర్మన్లు వనిత సంతోష్, మునిప‌ల్లి సత్యనారాయణ, వైస్ చైర్మన్ షఫీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి.ర‌ఘుగౌడ్‌, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగేరి శ్రీహరి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.