కోదాడలో మెగా జాబ్ మేళా..
- నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
- 250 కంపెనీలతో నియామకాలు..
- ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 19న కోదాడలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేళాకు 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జాబ్ మేళా ఏర్పాట్లపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతోపాటు సంబంధిత శాఖల అధికారులు, కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్ జాబ్ మేళాకు 40 వేల మంది నమోదు
విద్యావంతులైన యువతలో నిరుద్యోగం తీవ్రమైన సవాలుగా మారిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు సుమారు 200 కంపెనీలు హాజరుకాగా.. దాదాపు 40 వేల మంది నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో సుమారు 20 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, దాదాపు 3 వేల మంది ఉద్యోగాలు పొందడం లేదా తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం జరిగిందని వివరించారు. హుజూర్‌నగర్ జాబ్ మేళా విజయంతో స్ఫూర్తి పొంది కోదాడలో అంతకంటే భారీ స్థాయిలో ఉపాధి మేళా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
విద్యాసంస్థల్లో విస్తృత ప్రచారం
కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, ఐటీఐలకు ప్రత్యేక బృందాలను పంపించి ముఖ్యంగా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను మేళాకు ఆహ్వానించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రచార కార్యక్రమాలు, ఇతర సమాచార వేదికల ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
32 గదుల్లో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు
కోదాడలోని సి.సి. రెడ్డి కాన్వెంట్‌ను మెగా జాబ్ మేళా వేదికగా ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. కాన్వెంట్‌లోని 32 గదులను వివిధ కంపెనీల ఇంటర్వ్యూ ప్యానళ్లకు కేటాయించాలని సూచించారు. అదనంగా వచ్చే కంపెనీల కోసం మైదానం, పరిసర ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వాహనాల పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంతమంది అభ్యర్థులు హాజరైనా ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు.
ప్రతి అభ్యర్థికీ ఇంటర్వ్యూ అవకాశం
ఉదయం ప్రారంభమయ్యే నియామక ప్రక్రియ అవసరమైతే సాయంత్రం వరకు కొనసాగించాలని, జాబ్ మేళాకు వచ్చిన ప్రతి అభ్యర్థికీ ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించాలని మంత్రి సూచించారు. కంపెనీలతో సమన్వయం, అభ్యర్థుల సమీకరణ, నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వేదిక ఏర్పాట్ల బాధ్యతలను ప్రత్యేక బృందాలకు అప్పగించాలని ఆదేశించారు. మెగా జాబ్ మేళాను ప్రభుత్వ కార్యక్రమంగా, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమష్టి బాధ్యతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
