సీఎం సొంతూరిలో మెగా రైతు మేళా..

  • ముఖ్యమంత్రి స్వస్థలంలో భారీ రైతు సదస్సు
  • కొడంగల్‌లో నవంబర్‌ 7 నుంచి మూడు రోజుల పాటు
  • 150 ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు..
  • ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికతపై అవగాహన
  • చివరి రోజు 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతులు వస్తారని అంచనా
  • రైతులంతా మేళాను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించే లక్ష్యంతో కొడంగల్‌లో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. నవంబర్‌ 7న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ మేళాను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

మేళాలో 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతో పాటు ఆయిల్‌ఫెడ్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బ్యాంకింగ్‌ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి, క్రిడా తదితర సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రోన్లు, నూతన వ్యవసాయ ఉత్పాదకాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలను స్టాళ్లలో ప్రదర్శించనున్నారు. ఆధునిక సాగు విధానాలు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్‌ అవకాశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.

శాస్త్రవేత్తలతో ముఖాముఖి

మూడు రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు, అవార్డు గ్రహీతలతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేక హాలును ఏర్పాటు చేశారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, సుస్థిర వ్యవసాయ విధానాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.

తొలి రోజు 7,500 మంది రైతులు

నవంబర్‌ 7న వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్‌ నియోజకవర్గ రైతులు సుమారు 7,500 మంది పాల్గొననున్నారు. వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు ప్రదర్శన స్టాళ్లను సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులకు కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్‌ ఇన్‌పుట్‌ కేంద్రాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థలు తదితర పరికరాలు, యూనిట్లను పంపిణీ చేయనున్నారు.

రెండో రోజు మహిళా రైతులకు ప్రాధాన్యం

నవంబర్‌ 8న మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల పాత్ర, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారు.

చివరి రోజు 50 వేల మంది హాజరు

నవంబర్‌ 9న పొరుగు జిల్లాలతో కలిపి మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగంతో మేళా ముగియనుంది. ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని నేరుగా తెలుసుకోవడంతో పాటు శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, సాంకేతిక సంస్థల నిపుణులతో చర్చించే అవకాశం ఈ మేళా కల్పిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ మూడు రోజుల పాటు జరిగే మెగా రైతు మేళాలో పాల్గొని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.