సెప్టెంబర్ 7న ఆటో కార్మికులతో భేటీ : మంత్రి పొన్నం ప్రభాకర్
సంక్షేమ బోర్డు, అగ్రిగేటర్ విధానం, మీటర్ ఛార్జీలపై చర్చ
రీట్రోఫిట్మెంట్‌కు రూ.1.50 లక్షల సాయం అంశంపైనా నిర్ణయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొంటారని వెల్లడించారు. ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.
గత నెల 23న ఆటో యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు తనను కలిసి డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. వారి జీవనోపాధికి, సంక్షేమానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.
సమావేశంలో ప్రధానంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించనున్నారు. అలాగే అగ్రిగేటర్ విధానం, ఆటో కార్మికులు కోరుతున్న మేరకు మీటర్ ఛార్జీల పెంపు, డీజిల్, పెట్రోల్ ఆటోలను రీట్రోఫిట్మెంట్ చేసుకునేందుకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఒక్కో అంశానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, వివిధ శాఖల పరిధి, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తదితర అంశాలపై అధికారులు వివరాలు సమర్పించనున్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు ద్వారా కార్మికులకు మరింత భద్రత కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనుంది. అగ్రిగేటర్ విధానంపై ఆటో సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, సూచనలతో పాటు ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనుంది. మీటర్ ఛార్జీల పెంపుపై ఆటో కార్మికుల డిమాండ్‌ను పరిశీలించడంతో పాటు రీట్రోఫిట్మెంట్ కోసం ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆయా శాఖల పరిధిలోని అంశాలపై సమగ్ర నివేదికలు, వివరాలతో సమావేశానికి రావాలని సూచించారు. దీంతో ఆటో కార్మికుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులకు సమావేశం గురించి సమాచారం అందించి, వారు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. కార్మిక సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని, వారి సమస్యలపై చర్చించిన అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 7న జరిగే ఈ సమావేశంపై రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల్లో ఆసక్తి నెలకొంది.
