ఒకే కుటుంబంలో ఇద్దరికి మెడికల్ సీట్లు
మక్తల్, సెప్టెంబర్ 26 (ఆంధ్రప్రభ) : కనీస వసతులు లేని మారుమూర పల్లెటూరు, నిరుపేద వ్యవసాయ కుటుంబం (farming family) అయినా చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు. రామాయణ మహా గ్రంథాన్ని రచించిన వాల్మీకి మహర్షి వంశంలో పుట్టిన ఆ పిల్లలు చదువులో ఆ మహర్షిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా ప్రతిభలో తిరుగులేదని నిరూపించారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. అన్నా చెల్లెలు ఇద్దరు మెడికల్ సీటు (Medical seat) సాధించారు.
నారాయణపేట జిల్లా (Narayanpet District) మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు మెడికల్ సీటు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఎన్.రాజు, జయమ్మ దంపతుల కూతురు రమాదేవి.. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఆ తరువాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంజేపీటీ బీసీ గురుకుల అహన్వాడలో, ఇంటర్ ఎంజేపీటీ బీసీ గురుకుల భూత్పూర్‌లో చదువుకుంది. నీట్ ఎంట్రన్స్‌లో ఆల్ ఇండియా ర్యాంకు 1,44,895వ ర్యాంకు, స్టేట్ ర్యాంకు 2,666 రావడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్‌నగర్‌లో సీటు సాధించడం జరిగింది.
అదేవిధంగా వాల్మీకి బోయ ఎన్ రాజు లక్మిదేవమ్మ కుమారుడు ఎన్.మహేష్ (N. Mahesh) 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బిజ్వార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. నీట్ ఎంట్రెన్స్ కోసం మహబూబ్‌నగర్ (Mahabubnagar) లోని రిషి కళాశాలలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంబిబిఎస్ సీటు సాధించాడు. ఆలిండియా ర్యాంకు 3,2002.. స్టేట్ ర్యాంకు 8,353 ర్యాంక్ సాధించి సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ సిద్దిపేట కళాశాలలో మహేష్‌కు సీట్ వచ్చింది. అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ ఒకేసారి మెడికల్‌లో సీటు సాధించడం పట్ల మండల వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రభతో మాట్లాడుతూ… నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తమను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత మా తల్లిదండ్రులకు లేనప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని మెడికల్ సీటు సాధించినట్లు పేర్కొన్నారు. తమ ఉన్నతికి తమ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని రమాదేవి, మహేష్ పేర్కొన్నారు.