పెద్ద చెరువు సాక్షిగా నీటి దోపిడీ
భూగర్భ జలాలు ఖాళీ.. నిలువుదోపిడీ
పెద్ద చెరువునూ వదలని మాఫియా..
అధికారులు స్పందించేనా?
మేడ్చల్, (ఆంధ్రప్రభ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలో నీటి మాఫియా యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. ప్రజల తాగునీటి అవసరాలను, డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని నీటి ట్యాంకర్ల యాజమాన్యాలు తోడేళ్లలా విరుచుకుపడుతున్నాయి. నిబంధనలను బొందపెట్టి 24 గంటల పాటు నిరంతరాయంగా భూగర్భ జలాలను పంపింగ్ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూగర్భ జలాలు ఖాళీ.. నిలువుదోపిడీ
డివిజన్ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య సముదాయాలు, నిర్మాణ రంగాలు, నివాస ప్రాంతాల్లో నీటికి తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ట్యాంకర్ యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో భారీ బోర్లు వేసి, రోజుకు వందలాది ట్యాంకర్ల నీటిని తరలిస్తున్నాయి. రాత్రింబవళ్లు పంపింగ్ చేస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి.
సాధారణ ప్రజలకు బోరు నీళ్లు అందక అల్లాడుతుంటే.. మాఫియా మాత్రం ట్యాంకర్ నీటిని వేల రూపాయలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటోంది.
పెద్ద చెరువునూ వదలని మాఫియా..
అక్రమార్కుల ఆగడాలు ఏ స్థాయికి చేరాయంటే.. చివరకు మేడ్చల్ పెద్ద చెరువును సైతం వదలకుండా నీటిని తోడేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువు సమీపంలో భారీ బోర్లు వేసి, చెరువు నీటిని నేరుగా ట్యాంకర్లలోకి ఎక్కించుకుంటూ సహజ వనరులను విచ్చలవిడిగా దోచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు లబోదిబోమంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించేనా?
కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున నీటి దందా సాగుతున్నా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు నిద్రమత్తులో ఉండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, నిరంతరం నీటిని తోడేస్తున్న బోరు మోటర్ల విద్యుత్ కనెక్షన్లను తొలగించి, దందాపై ఉక్కుపాదం మోపి పెద్ద చెరువును కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
