డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9 మందికి జైలు శిక్ష
21 కేసుల విచారణ.. రూ.30,100 జరిమానా
మేడ్చల్, ఆంధ్రప్రభ: మద్యం సేవించి వాహనాలు నడిపిన తొమ్మిది మందికి మేడ్చల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాతో పాటు జైలు శిక్షలు ఖరారు చేసింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 21 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుధవారం మేడ్చల్‌లోని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కమ్ VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చాయి.
ఈ కేసుల విచారణలో భాగంగా ఒకటి కంటే ఎక్కువసార్లు మద్యం సేవించి వాహనాలు నడిపిన తొమ్మిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరికి మొత్తం రూ.30,100 జరిమానా కూడా ఖరారు చేసింది.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ క్రాంతి కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
