Mecca-Defense-Alliance-Activated : హౌతీలపై సమర‌మే …} Andhra Prabha Top News

Mecca-Defense-Alliance-Activated : హౌతీలపై సమర‌మే …} Andhra Prabha Top News

  • టర్కియే–పాక్‌–సౌదీ సిద్ధం
  • మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌ తొలిసారి యాక్టివేట్‌
  • సౌదీపై దాడి చేస్తే ముగ్గురిపై దాడిగానే పరిగణన
  • గల్ఫ్‌ రాజ్యంలోకి వేగంగా బలగాల తరలింపు

(రియాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి)

యెమెన్‌ హౌతీల దాడులతో గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీలను ఎదుర్కొనేందుకు టర్కియే, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా ఉమ్మడి రక్షణ ఒప్పందంలోని నిరోధక చర్యలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. అవసరమైన సైనిక బలగాలు, ఆయుధ సామర్థ్యాలను సౌదీ అరేబియాకు వేగంగా తరలించేందుకు అంగీకరించాయి.
రియాద్‌లో మూడు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆగస్టు 7న కుదిరిన ‘మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌’ ఒప్పందాన్ని తొలిసారిగా ఇప్పుడు అమల్లోకి తెచ్చారు.

ఒకరిపై దాడి.. ముగ్గురిపై లెక్క‌

ఈ రక్షణ ఒప్పందంలోని ప్రధాన నిబంధన.. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించడం. నాటో వ్యవస్థలోని కీలక నిబంధనను పోలిన ఈ ఒప్పందం ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. సౌదీ రక్షణ మంత్రి ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. తమ దేశంపై, పవిత్ర స్థలాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఉమ్మడి నిరోధక చర్యలను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మూడు దేశాల మధ్య ఐక్యత, పరస్పర సంఘీభావాన్ని మరోసారి చాటామని పేర్కొన్నారు.పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఒప్పందం ప్రకారం నిర్ణయించిన సైనిక బలగాలు, అవసరమైన సామర్థ్యాలను సౌదీకి అందించి.. వాటిని వేగంగా మోహరించేందుకు మూడు దేశాలు అంగీకరించాయని తెలిపింది. ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా, ముందుగా ఆమోదించిన ఏర్పాట్ల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.

యెమెన్‌లో ఎదురుదాడి

మూడు దేశాల కీలక నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందే యెమెన్‌లో మరో పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్‌ ప్రభుత్వానికి అనుకూల బలగాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎదురుదాడిని ప్రారంభించాయి.సౌదీ మద్దతుతో దూసుకెళ్లిన యెమెన్‌ ప్రభుత్వ బలగాలు ఎర్ర సముద్ర తీరంలోని మోచా పోర్టు నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. వ్యూహాత్మకమైన బాబ్‌ ఎల్‌-మందెబ్‌ జలసంధిపై కూడా తమ నియంత్రణ ఏర్పడిందని వెల్లడించాయి.యెమెన్‌ ప్రభుత్వ బలగాల ఆపరేషన్‌కు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మద్దతు ఇస్తున్నాయి. దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక సహకారం అందిస్తున్నాయని సంకీర్ణం తెలిపింది.

సౌదీపై హౌతీల దాడుల ప్రకటన

మరోవైపు హౌతీలు కూడా దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, తీర ప్రాంతంలోని రాబిగ్‌ ఆరామ్‌కో రిఫైనరీపై దాడులు చేసినట్లు వెల్లడించారు. విమానాశ్రయం, వైమానిక స్థావరం సహా పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు.అయితే హౌతీల ఈ ప్రకటనలను సౌదీ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.

1.4 మిలియన్‌ సైనిక బలం

మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌ ఏర్పాటుతో ప్రాంతీయ సైనిక సమీకరణానికి కొత్త రూపం వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. 2026 గ్లోబల్‌ ఫైర్‌పవర్‌ సూచీ ప్రకారం.. టర్కియే, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మూడు దేశాలకు కలిపి దాదాపు 14 లక్షల క్రియాశీల సైనిక బలగాలు, సుమారు 3,400 యుద్ధ విమానాలు, 6,000 ట్యాంకులు, 340కి పైగా నౌకాదళ ఆస్తులు ఉన్నాయి.ఆగస్టులో ఒప్పందం కుదిరిన సమయంలో ఒక్కో దేశం అందించాల్సిన సైనిక సహకారంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో కూటమిని కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంది.

‘ఇక ఒప్పందం అమల్లోకి వస్తుంది’

సెప్టెంబర్‌ ప్రారంభంలో హౌతీలు సౌదీ వైపు భారీగా క్షిపణులు ప్రయోగించిన సమయంలోనే పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యెమెన్‌లో జరుగుతున్న ఘర్షణ సౌదీ భూభాగానికి విస్తరించినా.. లేదా సౌదీపై ఎలాంటి కారణం లేని దాడి జరిగినా మక్కా ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అయితే సోమవారం వరకు ఈ కూటమి ప్రత్యక్షంగా ఎలాంటి చర్య తీసుకోలేదు. అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఇరాన్‌ అంశంపై టర్కియే, పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వ పాత్రలను కొనసాగించాలనుకోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావించారు.

‘ప్రాంతీయ భద్రతకు కీలక మలుపు’

మక్కా రక్షణ ఒప్పందాన్ని యాక్టివేట్‌ చేయడం గల్ఫ్‌ ప్రాంత భద్రతపై గణనీయమైన ప్రభావం చూపుతుందని గల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫోరమ్‌ నిపుణుడు అబ్దులజీజ్‌ అల్‌ఘషియన్‌ విశ్లేషించారు.ఇటీవలి వారాలు, నెలల్లో హౌతీలు చేపట్టిన దాడులు, రెచ్చగొట్టే చర్యలే మక్కా కూటమిని వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.ఇది కేవలం మూడు దేశాల సైనిక సహకారానికి పరిమితం కాకుండా.. మధ్యప్రాచ్యంలో కొత్త ప్రాంతీయ భద్రతా వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న సంకేతంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు ‘ప్రాంతీయ భద్రతా వ్యవస్థ’ అన్న మాట చర్చల్లో ఎక్కువగా వినిపించినప్పటికీ.. ఇప్పుడు అది ఎలా ఆచరణలోకి వస్తుందో కళ్లముందు కనిపిస్తోందని పేర్కొన్నారు.హౌతీల దాడులు.. యెమెన్‌లో ఎదురుదాడి.. సౌదీకి టర్కియే, పాకిస్థాన్‌ బలగాల తరలింపు.. ఇలా పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో గల్ఫ్‌లో తదుపరి దశ పోరాటం ఏ రూపం దాల్చనుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.