చామనపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించేందుకు చర్యలు

పెద్దపల్లి జిల్లా ధర్మారం, ఆంధ్రప్రభ: ధర్మారం మండలం చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ వేల్పుల రేవతి నాగరాజు వినతి మేరకు బుధవారం మంత్రి చామనపల్లి గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నంది మేడారం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచినట్లయితే చామనపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని సర్పంచ్‌ రేవతి నాగరాజు మంత్రికి వివరించారు.

దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌.. గ్రామ పరిస్థితులపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి, ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. గ్రామస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రానున్న కొద్ది రోజుల్లోనే సర్వే చేపట్టి తదుపరి చర్యలు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.