జగన్మాత ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
- కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు..
- యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలగాలని ప్రార్థన
- దసరా ఏర్పాట్లపై కలెక్టర్, అధికారుల సమన్వయానికి ప్రశంసలు
- విజయవాడ ఉత్సవ్ తో నగరానికి ప్రత్యేక గుర్తింపు
- స్థానిక వ్యాపారాలకు ఉత్సవాలు ఊతం
- రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్ష
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. వీరికి ఆలయ చైర్మన్ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా చైర్మన్ ఈఓ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
ఏర్పాట్లపై ప్రశంసలు..
శరన్నవరాత్రి ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బాగున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టడం అభినందనీయమన్నారు. దర్శన క్యూలైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం సంతోషకరమని పేర్కొన్నారు.
విజయవాడకు ప్రత్యేక గుర్తింపు..
నగరంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలతో స్థానిక చిరు వ్యాపారులు, ఇతర వాణిజ్య వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. నగర సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు విజయవాడ ప్రత్యేకతను చాటిచెబుతాయని అభిప్రాయపడ్డారు.
యువతకు ఉపాధే లక్ష్యం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికీకరణ వేగవంతమై యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. జగన్మాత కనకదుర్గమ్మ కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

