Math Day Celebrations | ఘనంగా గణిత దినోత్సవం

Math Day Celebrations | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన 150 గణిత బోధనోపకరణాలను ప్రదర్శించారు. క్షేత్రగణితం, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, బీజ గణితం అధ్యాయాలకు సంబంధించిన 6 నుండి 10 తరగతుల గణిత బోధనకు ఉపయోగపడే అభ్యసన సామాగ్రిలను ప్రదర్శించారు. ఎస్ సి ఈ ఆర్ టి సరఫరా చేసిన గణిత కిట్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ద్వారా రేఖా గణిత ఆకారాలు, నిత్యజీవితంలో పరిసరాలలో లభించే సామాగ్రి ద్వారా ఉపకరణాలు తయారు చేశారు.
తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు, కోనాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడరపు రాంప్రసాద్ మాట్లాడుతూ… గణితానికి సూత్రాలు, నిర్వచనాలు రెండు కళ్ళ వంటివని గణిత శాస్త్రాన్ని వివిధ సబ్జెక్టులతో అన్వయించి నేర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. అనిత ఉపాధ్యాయుడు శ్రీధర్ సౌజన్యంతో పదో తరగతి విద్యార్థులు గణిత స్టడీ మెటీరియల్, క్విజ్ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, రామకృష్ణ, భాస్కర్, గీత హిమవతి, రాజరాజేశ్వరి పాల్గొన్నారు.
