Theft| మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భారీ చోరీ
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భారీ చోరీ
- అర్ధరాత్రి క్యారెట్‌లేన్‌లో భారీ చోరీ.. రూ.7 కోట్ల ఆభరణాలు మాయం!
- షట్టర్లు తొలగించి షోరూమ్‌లోకి దుండగులు
- వజ్రాలు, బంగారు ఆభరణాలతో పరారీ.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
- సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్న మేడిపల్లి పోలీసులు
మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భారీ చోరీ కలకలం రేపింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్‌లేన్ (CaratLane) జ్యువెలరీ షోరూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. షోరూమ్ షట్టర్లు తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. సుమారు రూ.7 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
షట్టర్లు తొలగించి.. లోపలికి
ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు పక్కా ప్రణాళికతో షోరూమ్‌ను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షట్టర్లను తొలగించి లోపలికి ప్రవేశించిన అనంతరం విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఉదయం షోరూమ్‌లో చోరీ జరిగిన విషయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి క్లూస్ టీమ్.. సీసీటీవీ పరిశీలన
సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. షోరూమ్ పరిసరాలతో పాటు జాతీయ రహదారి, సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
దొంగల కోసం ప్రత్యేక బృందాలు
చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దొంగలు ఏ వాహనంలో వచ్చారు? చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది.
