ఒక వ్యక్తి శుక్రవారం ఉదయం అయిదున్నర గంటల సమయంలో భారత పార్లమెంటు (Parlament) భవనంలోకి దూకి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశాడన్న వార్త ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను దాటుకుని పార్లమెంటు భవనంలోకి అవలీలగా దూకడమేమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.
చుట్టూ సీసీకెమెరాలు (CCTV cameras)..పహారా సిబ్బంది.. చీమ చిటుక్కుమన్నా అప్రమత్తం అయ్యే సాంకేతిక వ్యవస్థ…ఇవన్నీ ఏమైపోయాయి? అతడు ఆగంతకుడు అవునో కాదో తర్వాత సంగతి. ఉగ్రవాది, తీవ్రవాది, ఆయుధాలు ధరించాడు, అమాయకుడు, మతి స్థిమితం లేనివాడు అనేవి కూడా తర్వాత సంగతి. ఒకవేళ అతను నిజంగా అమాయకుడో (Innocent), మతిస్థిమితం లేనివాడో అయితే, మరీ అలాంటోడు కూడా అవలీలగా ప్రవేశించాడంటే ఏమిటీ భద్రతా వ్యవస్థ? ఎన్నటికీ బాగుపడదా? ఎప్పటికీ డొల్లేనా అని సందేహాలు కలగకమానవు.
దాదాపు పాతికేళ్ళ క్రితం…అంటే 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్ మహిళా అధికారిణి (CRPF female officer), ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. భద్రతా దళాలు దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.
దాడుల సూత్రధారి అఫ్జల్ గురుకు మాత్రం ఊరట లభించలేదు. మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో చివరకు ఫిబ్రవరి 9, 2013న దిల్లీలోని తిహాడ్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలయ్యింది.
ఆ తర్వాత 2023 డిసెంబర్ 13న, అంటే 2001 దాడికి సరిగ్గా 22 ఏళ్ల తర్వాత, పార్లమెంటులో మరో సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి, రంగు పొగను విడుదల చేసి నినాదాలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంఘటన…భద్రతా వ్యవస్థ పున:సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.