బొగ్గు పరిశ్రమలో భారీ కుంభకోణాలు

  • సీబీఐ, విజిలెన్స్ విచారణ చేపట్టాలి..
  • ఉత్పత్తి తగ్గడానికి కాంగ్రెస్ విధానాలే కారణం
  • సైట్ విజిట్ పేరుతో అక్రమాలు..
  • సింగరేణిని రక్షించే బ్రహ్మాస్త్రం కేసీఆర్
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : 135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భారీ కుంభకోణాలకు తెర తీశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వ‌హించిన‌ సింగరేణి కార్మిక సింహగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గడంతోపాటు సంస్థకు రావాల్సిన లాభాలు, కార్మికుల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విమర్శించారు. సింగరేణిలో రూ.10 వేల కోట్లకు పైగా కుంభకోణాలు జరిగాయని, వీటిపై సీబీఐ, విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులు కేవలం బోనస్, హక్కుల కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఉద్యమించారని నాయకులు గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపుతో నిర్వహించిన సకల జనుల సమ్మెలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, తెలంగాణ ఉద్యమంలో గోదావరిఖని ప్రాంత కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో సింగరేణి సంస్థ మెరుగైన ప్రగతిని సాధించిందని, రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

రూ.10 వేల కోట్ల కుంభకోణం!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది సృజన్రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి సంస్థలో టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని అడ్డుపెట్టుకుని రూ.10 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది సృజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. టెండర్లలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనల ద్వారా కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ల ప్రక్రియను మార్చారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. టెండర్ల నిబంధనల్లో మార్పులు, అంచనా వ్యయాలకు మించి కాంట్రాక్టులు కేటాయించడం వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. సింగరేణిలోని బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ పనులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లన్నింటిపై విచారణ చేపట్టాలని కోరారు.

బొగ్గు కొరత పేరుతో విద్యుత్ సరఫరాకు బ్రేకులు..

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని, బొగ్గు కొరత పేరుతో 24 గంటల విద్యుత్ సరఫరాపై సాకులు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సుమారు 4,000 మెగావాట్ల సామర్థం కలిగిన యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులో బొగ్గు సరఫరా సమస్యల కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని ఆరోపించారు.

సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయని, బొగ్గు ఎక్కడికి వెళ్తుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే 2023లో సింగరేణిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగ్గా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 58 మిలియన్ టన్నులకు తగ్గిందని ఆరోపించారు.

ఉత్పత్తి తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు టెండర్లను పలుమార్లు వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.

కార్మికుల సంక్షేమం పట్టదా..

గతంలో ప్రతి ఏడాది సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా పంపిణీ చేసేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లలో రూ.6 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టాయని విమర్శించారు. కార్మికులకు దసరా బోనస్ చెల్లింపుల విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు. గతంలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి, కేసీఆర్ హయాంలో సుమారు 16 వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.

సింగరేణిని కాపాడాలి..

సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఆస్తులు, సంస్థలో ప్రభుత్వ వాటాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగరేణి సంస్థను పరిరక్షించడంతోపాటు కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ నాయకత్వాన్ని కార్మికులు గుర్తుంచుకోవాలని కోరారు. సింగరేణి సంస్థను బలోపేతం చేసి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, సంస్థను బతికించేందుకు ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం కె సీఆర్ అని స్పష్టం చేశారు.