హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

బాలాపూర్ ప్లాస్టిక్ గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో దట్టమైన పొగతో పాటు అగ్నికీలలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..

స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాల్సి ఉంది.