Breaking | ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

  • ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో ఘటన

ఆంధ్రప్రభ, ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. కాగా, ఈ ఎన్‌కౌంట‌ర్‌లో 12 మంది మావోయిస్టులు, ఇద్ద‌రు జ‌వాన్లు చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారికోసం హెలికాప్ట‌ర్‌ను పంపిన‌ట్టు అధికారులు తెలిపారు. ఇక‌.. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని సమాచారం. ఘటనా స్థలం నుంచి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బృందాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి.

ఇటీవల ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కుల్హాడీఘాట్ లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఆదివారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు మరణించారు. కాగా, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *