చెరుకుచెర్లలోమూకుమ్మడి దాడి కలకలం..

9 మంది అరెస్ట్.. 21 మందిపై నిఘా!

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామంలో శాంతిభద్రతలకు సవాల్ విసిరేలా జరిగిన మూకుమ్మడి దాడి ఘటనలో మిడుతూరు పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో 9 మందిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. మిడుతూరు పోలీస్ స్టేషన్లో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అక్టోబర్ 5న రాత్రి 7 గంటల సమయంలో చాకలి పేటలోని ఆమె ఇంటిపై 30 మందికి పైగా గుంపుగా దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి, కర్రలతో, చేతులతో విచక్షణారహితంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ దాడిలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలు దాసరి సుజాత ఫిర్యాదు మేరకు మిడుతూరు పోలీసులు కింద కేసు నమోదు చేశారు.ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో, మిడుతూరు ఎస్సై ఓబులేసు తన సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. అక్టోబర్ 8న తెల్లవారుజామున 3:30 గంటలకు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, నందికొట్కూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

ఈ ఘటనలో పాత్రధారులైన మరో 21 మందిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలు, దాడులకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని మిడుతూరు సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.ఘటనకు దారితీసిన కారణాలు, వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో వ్యక్తిగత వివాదాలు, కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పరస్పరం దాడులకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సహించబోమని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా ఘర్షణలకు దిగకుండా పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటనకు సంబంధించి కేసులో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందని విచారణ పూర్తయిన అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని సీఐ స్పష్టం చేశారు.