22ఏ జాబితాపై మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్‌

మల్కాజ్‌గిరిలో 30 వేల ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయన్న ఎమ్మెల్యే
పన్నులు చెల్లించిన సామాన్యుల ఇళ్లకు రక్షణ కల్పిస్తామని హామీ

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 22ఏ నిషేధిత జాబితా అంశంపై మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. తన నియోజకవర్గ పరిధిలోనే వేలాది ఇళ్లు 22ఏ జాబితాలో చేరాయని, దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న వారు, క్రమం తప్పకుండా పన్నులు, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ వారి ఆస్తులు నిషేధిత జాబితాలో ఉండటం ఆందోళనకరమని అన్నారు.

సైనికుడి కుటుంబ భూమి కూడా జాబితాలోకి

దేశ రక్షణలో పనిచేసిన ఓ సైనికుడు మృతి చెందిన తర్వాత ఆయన భార్యకు కేటాయించిన భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి సమస్యలతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం

గతంలో వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉన్న సుమారు 10 వేల ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల సమస్యలను కూడా పరిష్కరించేందుకు పోరాడుతామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు అండగా ఉంటామని మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.