జలదిగ్బంధంలో మార్లపాడు తండా
- పూర్తిగా నిరాశ్రయులైన గ్రామస్తులు
- వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పశుసంపద
- గ్రామంలోని మొత్తం జనాభాను పునరావాస కేంద్రానికి తరలింపు
- సహాయక చర్యలలో పాల్గొన్న తహసిల్దార్, పోలీస్ సిబ్బంది.
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District), అచ్చంపేట మండలం మర్లపాడు తండా గత మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి జల దిగ్బంధంలో చిక్కుకొని దాదాపు 200 మంది గ్రామస్తులు గొడ్డు గోదాలతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అధికారులు కల్పించిన పునరావస(Rehabilitation) కేంద్రాలకు తరలించబడ్డారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట, పత్తి దిగుబడులను కళ్లెదుటే తమ పశుసంపద, మేకలు, కోళ్లు వరదలో కొట్టుకుపోతుంటే మిన్నంటిన గ్రామస్తుల రోదనలతో చూసేవారికి కడుపు తరుక్కు మనక మానదు. అచ్చంపేట తహసిల్దార్ సైదులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు(Circle Inspector Nagaraju), ఎస్సై, పోలీస్ శాఖ సిబ్బంది, ఫైర్ స్టేషన్ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు, రిస్క్యూ టీం సభ్యులు హుటాహుటిన గ్రామాన్ని చేరుకొని నడుములోతు వరదకు ఎదురీది వెళ్లి గ్రామస్తులను కాపాడి కిస్ట్య తండా మీదుగా సిద్దాపూర్(Siddapur) గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

గ్రామంలోని ప్రతి ఇల్లు దాదాపు 6 ఫీట్లకు మీదుగా ముంపుకు గురి కావడంతో రైతులు పండించుకున్న తమ ధాన్యం, క్వింటాళ్లకొద్ది(Quintallakoddi) నిలువ చేసుకున్న పత్తి నీటిపాలై పోవడంతో రైతుల రోదనలు మిన్నంటాయి.


