కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణా
పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్..
మరిపెడ పోలీసుల తనిఖీల్లో గుట్టురట్టు
నంబర్ ప్లేట్ లేని ట్రాలీలో ఎనిమిది పశువుల తరలింపు
కాళ్లు, మెడకు తాళ్లు కట్టి అమానుషంగా రవాణా
మరిపెడ, ఆంధ్రప్రభ : సినిమాల్లో చూపించే స్మగ్లింగ్ సన్నివేశాలను తలపించేలా పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొబ్బరి బొండాల మాటున ఎనిమిది పశువులను తరలిస్తున్న వాహనాన్ని మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు.
రాత్రి వేళల్లో పోలీసుల కంటపడకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల వ్యవహారం పెట్రోలింగ్‌లో బయటపడింది. అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రాలీని ఆపి తనిఖీ చేయగా, కొబ్బరి బొండాల మాటున ఆరు ఆవులు, రెండు కోడెగిత్తలు ఉన్నట్లు గుర్తించారు. పశువుల కాళ్లు, మెడకు తాళ్లు కట్టి కదలలేని స్థితిలో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని రక్షించి, పశువైద్యుల ద్వారా చికిత్స అందించారు.
అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలింపు?
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అనే వ్యక్తులు పశువులను కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇదే తరహాలో పశువులను రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వాహనం సీజ్.. నిందితులపై కేసులు
ఈ ఘటనలో పశువులను తరలిస్తున్న టాటా ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు. పశువుల అక్రమ రవాణా, పశువుల వధకు సంబంధించిన చట్టాల కింద నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెట్రోలింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి అనుమానాస్పద వాహనాన్ని తనిఖీ చేయడంతో అక్రమ రవాణా గుట్టురట్టయింది. మూగజీవాలను కాళ్లు, మెడకు తాళ్లతో బంధించి అమానుషంగా తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
