Marico Q2 Growth | మారికోకు మస్తు జోష్!.. ప్రీమియం జోరుతో దూసుకెళ్తున్న వ్యాపారం!
Marico Q2 Growth | మారికోకు మస్తు జోష్!.. ప్రీమియం జోరుతో దూసుకెళ్తున్న వ్యాపారం!
- రెండో త్రైమాసికంలో రెండంకెల వృద్ధి అంచనా
- ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్
- దేశీయ వ్యాపారంలోనూ రెండంకెల వాల్యూమ్ వృద్ధి
- కోప్రా ధరలు 35 శాతం తగ్గడం కలిసొచ్చే అవకాశం
- వియత్నాం, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికాలోనూ మెరుగైన పనితీరు
Marico Q2 Growth | ఆంధ్రప్రభ, బిజినెస్ ప్రతినిధి : ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ వినియోగ వస్తువుల సంస్థ మారికోకు కలిసొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కంపెనీ ఏకీకృత ఆదాయం రెండంకెల శాతంలో పెరిగే అవకాశం ఉందని మారికో వెల్లడించింది. దేశీయ మార్కెట్లో బలమైన డిమాండ్, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల విక్రయాలు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
మారికో వృద్ధిలో ప్రీమియం హెయిర్ ఆయిల్స్, సఫోలా వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల పాత్ర పెరుగుతోంది. అందుకే సాధారణ ఉత్పత్తుల కంటే అధిక మార్జిన్ ఇచ్చే ప్రీమియం ఉత్పత్తులపై కంపెనీ ఎక్కువగా దృష్టి పెడుతోంది. మారికో ప్రధానంగా హెయిర్ కేర్, వంట నూనెలు, వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్యం–వెల్‌నెస్ విభాగాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశీయ మార్కెట్‌లో విస్తృతంగా వినియోగించే పలు ప్రముఖ బ్రాండ్లు ఈ సంస్థకు ఉన్నాయి.
మారికో ఉత్పత్తులు
పారాచూట్ : కొబ్బరి నూనెతో పాటు హెయిర్ కేర్ ఉత్పత్తులు.
పారాచూట్ అడ్వాన్స్‌డ్ : హెయిర్ ఆయిల్స్, ప్రత్యేక హెయిర్ కేర్ ఉత్పత్తులు.
సఫోలా : వంట నూనెలు, ఓట్స్, తినుబండారాలు, ఆరోగ్య–వెల్‌నెస్ ఉత్పత్తులు.
లివ్‌ఆన్ : హెయిర్ సీరమ్స్, హెయిర్ కేర్ ఉత్పత్తులు.
హెయిర్ & కేర్ : హెయిర్ ఆయిల్స్.
బీర్డో : పురుషుల గ్రూమింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తులు.
ట్రూ ఎలిమెంట్స్ : ఆరోగ్యకరమైన స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ తదితర వెల్‌నెస్ ఉత్పత్తులు.
కజల్ తదితర వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: మారికో పోర్ట్‌ఫోలియోలో వివిధ వ్యక్తిగత సంరక్షణ విభాగాలు కూడా ఉన్నాయి.
మారికోకు చెందిన ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తులతో కూడిన వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్స్ విభాగం వరుసగా ఆరో త్రైమాసికంలోనూ 20 శాతం స్థాయికి చేరువైన వృద్ధిని నమోదు చేసింది. ఆహారం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సహా వివిధ విభాగాల్లో అధిక ధర కలిగిన ఉత్పత్తుల వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఈ విభాగం మెరుగైన పనితీరు కనబరుస్తోంది.
దేశీయ వ్యాపారంలో రెండంకెల వృద్ధి
పారాచూట్ కొబ్బరి నూనె, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్లను కలిగి ఉన్న మారికో.. భారత్‌లోని వ్యాపారంలో అంతర్గత ప్రాతిపదికన రెండంకెల స్థాయిలో వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. వినియోగదారుల డిమాండ్ బలంగా ఉండటం ఇందుకు దోహదపడింది.
తగ్గిన కోప్రా ధరలు
మారికో ఉత్పత్తులకు కీలకమైన ముడిసరుకు కోప్రా ధరలు గరిష్ఠ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం సుమారు 35 శాతం తక్కువగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ముడిసరుకు ధరలు తగ్గడం కంపెనీ మార్జిన్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
విదేశీ మార్కెట్లలోనూ మెరుగైన ఫలితాలు
మారికో అంతర్జాతీయ వ్యాపారం కూడా మెరుగైన పనితీరు కనబరిచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన విదేశీ వ్యాపారం టీన్ శాతం స్థాయిలో వృద్ధి చెందింది. వియత్నాం, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా మార్కెట్లు ప్రధానంగా వృద్ధికి దోహదపడ్డాయి. బంగ్లాదేశ్‌లోనూ గత త్రైమాసికంతో పోలిస్తే వ్యాపార పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని కంపెనీ తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగడం, దేశీయ విక్రయాల్లో వాల్యూమ్ వృద్ధి, కీలక ముడిసరుకు ధరలు తగ్గడం వంటి అంశాలు రెండో త్రైమాసికంలో మారికో కు మార్కెట్ కలిసొచ్చింది.
