Fire Accident | రూ.30 లక్షల ఆస్తి నష్టం అంచనా..
పుష్ప షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ బస చేసిన వీఐపీ కాటేజ్ దగ్ధం
రిసార్టుల్లో ఫైర్ సేఫ్టీపై ఆందోళన
Fire Accident | మారేడుమిల్లి, ఆంధ్రప్రభ : పోలవరం (రంపచోడవరం) జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లిలో ‘ది వుడ్స్’ రిసార్ట్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వీఐపీ సూట్ రూమ్ ఉన్న ఓ కాటేజ్ పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. పుష్ప సినిమా షూటింగ్ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ వీఐపీ కాటేజ్‌లోనే బస చేశారు.
మారేడుమిల్లి మండల కేంద్రంలో రంపచోడవరం ఐటీడీఏ నిధులతో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో ‘ది వుడ్స్’ పేరుతో రిసార్ట్ నిర్మాణాలు చేపట్టారు. అనంతరం ఈ కాటేజీల నిర్వహణను ఓ ప్రైవేట్ గుత్తేదారుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో విడిది గృహాలను పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఓ లగ్జరీ వుడెన్ కాటేజ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కాటేజ్ నిర్మాణంలో సుమారు 70 శాతం కలపను ఉపయోగించడంతో మంటలు వేగంగా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అయితే, అప్పటికే అక్కడ బస చేసిన పర్యాటకులు కాటేజ్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
రిసార్టుల్లో ఫైర్ సేఫ్టీ శూన్యం
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్టుల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో సుమారు 100 నుంచి 150 వరకు రిసార్టులు ఉన్నట్లు అంచనా. వీటిలో ఒకటి, రెండు మినహా మిగిలిన రిసార్టుల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఆంధ్రప్రభ దినపత్రికలో ఆగస్టు 31న ‘రిసార్టుల్లో ఫైర్ సేఫ్టీ గాలికేనా?’ అనే కథనం ప్రచురించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు.
పర్యాటకుల భద్రత ఏదీ?
‘ది వుడ్స్’ రిసార్ట్‌లో 20కి పైగా కాటేజీలతో పాటు వుడెన్ క్యాంటీన్, సమావేశ మందిరం తదితర నిర్మాణాలు ఉన్నాయి. ఇన్ని నిర్మాణాలు ఉన్నప్పటికీ కనీస అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక రంగంలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ, పర్యాటకుల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అధికారుల తనిఖీలు ఏవీ?
రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లోని రిసార్టులు, రెసిడెన్సీల్లో అగ్నిమాపక పరికరాలు లేవనే ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే ముందుగానే అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
