సజావుగా మండల సర్వసభ్య సమావేశం..

  • గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని తీర్మానం
  • కూడా పరిధిలో ఇళ్ల నిర్మాణాలకు గ్రామ పంచాయతీలకే అనుమతులు ఇవ్వాలని సర్పంచ్‌ల డిమాండ్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం సజావుగా జరిగింది. సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌కు ఉచిత కరెంటు ఇవ్వాలని సర్పంచ్‌లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కూడా పరిధిలోని గ్రామాల్లో ఇంటి నిర్మాణాలకు గ్రామ పంచాయతీలే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చింతలపల్లి సర్పంచ్‌ బొంకూరి రజిత మాట్లాడుతూ మోడల్‌ పాఠశాలకు వెళ్లే దారిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. జగన్నాథ్‌పూర్‌ సర్పంచ్‌ పంజాల యాదగిరి మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

ఎంపీడీవో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం, అవగాహన కల్పిస్తూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ వైద్యం వినియోగించుకోవాలి

వైద్యాధికారి రాజశేఖర్‌ మాట్లాడుతూ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎల్కతుర్తి పరిధిలో 12 గ్రామాలు, గోపాల్‌పూర్‌ పరిధిలో ఎనిమిది గ్రామాలు ఉన్నాయని వివరించారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది ప్రసవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో మొత్తం 35 పాఠశాలలు ఉండగా, 2,230 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుతున్న విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో ఎల్కతుర్తి సర్పంచ్‌ మునిగడప లావణ్య, సొసైటీ చైర్మన్‌ శ్రీపతి రవీందర్‌గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.