అభివృద్ధిపై కాంగ్రెస్‌తో బహిరంగ చర్చకు సిద్ధం
చల్మెడ–నందగోకుల్ రోడ్డు పనులు ప్రారంభించే వరకు పోరాటం
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలోనే మండల అభివృద్ధి: బీఆర్‌ఎస్ నాయకులు
నిజాంపేట, ఆంధ్రప్రభ: నిజాంపేట మండలంలో అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలోనే జరిగిందని, ఆమె అభివృద్ధి చేయలేదంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మండల బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.13 కోట్ల వ్యయంతో నస్కల్, నందగోకుల్, చల్మెడ కమాన్ వరకు రోడ్డు మంజూరు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు.
నిధులు మంజూరై రోడ్డు పనులు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొబ్బరికాయ కొట్టిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. కంకర పోసిన అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని, ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. బచ్చురాజుపల్లి, నార్లాపూర్, నందిగామ గ్రామాల మీదుగా మల్లన్నసాగర్ కాలువ నీటిని అందించి గ్రామాలను సస్యశ్యామలం చేసిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారని విమర్శించారు.
గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసి పార్టీ ద్వారా లబ్ధి పొందిన నాయకులే ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని, ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు పాలాభిషేకం చేసిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇటీవల నిర్వహించిన పాదయాత్రకు మండలం నుంచి ప్రజలు రాలేదని, ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చారన్న కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఖండించారు.
పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న దృశ్యాలను వీడియోల్లో చూసి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో మండలానికి తీసుకొచ్చిన నిధులు ఎన్ని, ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌రావు రెండేళ్లలో తీసుకొచ్చిన నిధులు ఎన్ని అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చల్మెడ–నందగోకుల్ రోడ్డు పనులు ప్రారంభించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. త్వరలో పనులు ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
