వాగులో వ్యక్తి మృతదేహం లభ్యం

చెన్నూర్‌ వాసిగా గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు

జైపూర్, ఆంధ్రప్రభ: భీమారం మండలం గొల్లవాగులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాజేందర్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గొల్లవాగులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాగు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతుడి వివరాల కోసం ఆరా తీయగా చెన్నూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఎస్సై రాజేందర్‌ తెలిపారు.