రామనామ ఘోషతో మార్మోగిన మల్లికార్జునపేట..
ఘనంగా స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ
సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు ప్రత్యేక పూజలు
భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల ప్రతిష్ఠ మహోత్సవం
పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదం
పద్మశాలి సమాజం ఐక్యతతో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్ష
(భవానిపురం, ఆంధ్రప్రభ ) : రామనామ ఘోషతో మల్లికార్జునపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లతో పాటు భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేదమంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పవిత్రమైన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పద్మశాలి సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లతో పాటు భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత పవిత్రమైనదన్నారు. దేవాలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పద్మశాలి సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉమ్మడి చంటి, గుండారపు హరిబాబు, ఈగల సాంబ, నందం భవానీ ప్రసాద్, నందం నాగరాజు, కోసూరి నూకరాజు, జాగు సూరిబాబు, తేలు సూరిబాబు, పెంటపల్లి బాబ్జీ, వానపల్లి త్రిమూర్తులు, కొల్లి మాణిక్యరావు, వడ్డాది రమణ, అజీజ్, కుంచం దుర్గారావు, అనంతలక్ష్మి, ప్రియా తదితరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
