ప్యూర్ ఈవీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

  • తెల్లవారుజాము నుంచి ఎగసిపడుతున్న మంటలు
  • మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన మూడు ఫైర్‌ ఇంజన్లు
    సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్యూర్ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము నుంచి మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.